దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' మొదటి ఆటనుండే
పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.అక్టోబర్ 1 బుధవారం నాడు రామ్ చరణ్ నటించిన
'గోవిందుడు అందరివాడేలే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో మొదటిసారి రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో
కాజల్ కథానాయిక.బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్,కమలినీ
ముఖర్జీ,ప్రకాష్ రాజ్,జయసుధ,పోసాని,కోట శ్రీనివాసరావు,రావు రమేష్ ముఖ్య
తారాగణం.సినిమా కథా విశేషాల్లోకి వెళ్తే....
ఊరు బాగోగులు కోరుకునే వ్యక్తి బాలరాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు
కుమారులు.పెద్దవాడు చంద్రశేఖర్(రహమాన్),చిన్నవాడు
బంగారం(శ్రీకాంత్).చంద్రశేఖర్ డాక్టర్ కావాలని,ఊరి ప్రజలకు మెరుగైన వైద్యం
చేయాలని బాలరాజు కోరుకుంటాడు.డాక్టర్ కావాలనే కోరికను చంద్రశేఖర్
తిరస్కరించడంతో తండ్రీకొడుకులు విడిపోతారు.చంద్రశేఖర్ వెళ్లి లండన్ లో
స్థిరపడతారు.చంద్రశేఖర్ కుమారుడు అభిరామ్(రామ్ చరణ్)లండన్ లో పెరిగినా
భారతీయ సాంప్రదాయాల పట్ల మంచి గౌరవం ఉంటుంది.
తండ్రికీ.తాతకు మధ్య విభేదాలు ఏంటో తన తండ్రి ద్వారా తెలుసుకున్న
అభిరామ్ ఇండియాకు వస్తాడు.బాలరాజు కుటుంబంలో తమ ఫ్యామిలీ కూడా కలపాలని
ఆరాటపడే అభిరామ్ అపరిచితునిగా బాలరాజు ఇంట్లోకి ప్రవేశిస్తాడు.అలా వచ్చిన
అభిరామ్ తను అనుకున్న లక్ష్యాన్ని అధిగమించాడా?అభిరామ్ ఆ కుటుంబ వారసుడే
అని బాలరాజుకు తెలుస్తుందా?తెలిస్తే ఏవిధంగా స్పందిచారు?తన మరదలు
సత్య(కాజల్)ప్రేమను ఎలా దక్కించుకున్నాడు?చివరికి ఏమైంది వంటి విషయాలు
తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
కుటుంబ విలువలు,బాంధవ్యాలు మొదలగు అంశాలు సినిమాలో చక్కగా
చూపించారు.రామ్ చరణ్ కుటుంబ కథా చిత్రాలను ఎలా చేస్తాడో అనుకున్నారు,కాని
ఊహించినదానికంటే అధ్బుతంగా నటించాడు.ఇప్పటివరకు తను నటించిన చిత్రాలకు ఇది
భిన్నం అని చెప్పవచ్చు.నటన పరంగా రామ్ చరణ్ 100 మార్కులు కొట్టేశాడు.రామ్
చరణ్,కాజల్ ల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగుంటుంది.తెలుగు ప్రేక్షకులకు మంచి
కుటుంబ కథా చిత్రం అందించాలని తలచిన దర్శకుడు కృష్ణవంశీ అందులో విజయం
సాధించాడు అని చెప్పవచ్చు.ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది.బాలరాజు పాత్రలో
ప్రకాష్ రాజ్ జీవించాడు,ప్రకాష్ రాజ్ మాత్రమే ఇలాంటి పాత్రలకు న్యాయం
చేయగలడు అని మరోసారి నిరూపించాడు.
మైనస్ పాయింట్స్
సంగీతం,ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది.రొటీన్ కథే అన్న
ఫీలింగ్ కలుగుతుంది.నెగెటివ్ పాత్రలకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్
చేయాల్సింది.
పాత్రలకు తగ్గట్టు సినిమాలో ప్రతీఒక్కరూ బాగా నటించారు.జయసుధ,కమలినీ
ముఖర్జీ,శ్రీకాంత్,రావు రమేష్,కోట తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం.మంచి
కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి.8వ చిత్రం ఫాఫ్ అనే
ఫోబియాను రామ్ చరణ్ అధిగమించాడు అని చెప్పొచ్చు .
రేడియో జల్సా రేటింగ్ :3.25/5